ఎప్పుడూ ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ అంటూ కూర్చోపోతే కాస్త బయటతిరిగి రావచ్చు కదా! నలుగురిలో కలవకుండా ఇదెక్కడి చోద్యం! అంటూంటారు ఇంట్లో పెద్దవాళ్ళు. కానీ కేవలం సరదాగా గడపడానికి, ఫోటోలు షేర్ చేసుకోవడానికే కాక నిత్యజీవితంలో ఎదు రయ్యే సమస్యలను కూడా సామాజిక మీడియా ద్వారా పరిష్కరించుకోవచ్చని నిరూపించాడు గోవింద్ నారాయణ్! ఒకే ఒక్క ట్వీట్‌తో తాను ప్రయాణిస్తున్న రైల్లో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించాడు.
బర్మార్ ఎక్స్‌ప్రెస్‌లో బికనీర్‌కు బయలు దేరాడు గోవింద్ నారాయణ్. టిటిఇని అడిగి కోచ్ నెంబర్-ఎస్6 లో ఒక సీటులో కూర్చున్నాడు. రిజర్వేషన్‌లేని ప్రయాణికులు సీటు కోసం 15 రూపాయలు సమర్పిస్తున్నారుగానీ రిసీట్ ఇవ్వటం లేదు టిటిఇ. బిల్లు ఇమ్మని ఎవరూ అడగడం లేదు. కానీ గోవింద్ కూడా తనకు పట్టనట్టు కూర్చోలేదు. పదేపదే టిటిఇ శ్యామ్‌పాల్ వెనుక తిరుగుతూ బిల్లు ఇమ్మని అడగసాగాడు. ‘బికనీర్‌లో దిగేలోపు బిల్లు ఇస్తా’నంటూ టిటిఇ కాలక్షేపం చేస్తున్నాడు. ఇక గోవింద్ జోధ్‌పూర్ స్టేషనకి చేరుకోగానే ట్విట్టర్‌లో లాగినై రైల్వే శాఖకు, రైల్వేమంత్రి సురేష్ ప్రభు, ప్రధాని నరేంద్రమోదీ, డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం)కి ట్వీట్లు చేశాడు. అతడి ఫిర్యాదు డీఆర్‌ఎం ఆఫీస్‌కు చేరుకున్నట్టు కొద్దిసేపటికే గోవింద్‌కి మెసేజ్ వచ్చింది. డీఆర్‌ఎం స్వయంగా గోవింద్‌తో ఫోన్లో మాట్లాడాడు. విజిలెన్స్ ఆఫీసర్ ముకేష్ గెహ్లాట్ ఆధ్వర్యంలో ఒక బృందం జోధ్‌పూర్‌లోనే రైలెక్కింది. టిటిఇ రికార్డు లన్నీ ఈ బృందం చెక్ చేసి డీఆర్‌ఎంకి రిపోర్ట్ చేసింది. వెంటనే శ్యామ్‌పాల్‌ని సస్పెండ్ చేస్తూ డి.ఆర్.ఎం ట్వీట్ చేశాడు. దాంతో మార్తా స్టేషన్లోనే టిటిఇని దింపేశారు. ఒక్క ట్వీట్‌తో అవినీతి టిటిఇ సస్పెండ్ అయ్యాడు. ఇలా పౌర సమస్యల పరిష్కారానికి సామాజిక మీడియాను కూడా ఉపయోగించుకోవచ్చు! గోవింద్ భలే చేశాడు కదా!-

EmoticonEmoticon