Monday, 19 September 2016

పరిమిత దాడులు?

Tags

  • సైన్యం సిద్ధంగా ఉండాలి
  • త్రివిధ దళాలకు కేంద్రం ఆదేశం
  • పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై గురి
  • తేదీ, సమయం త్వరలో ఖరారు
  • దోవల్‌కు బాధ్యత అప్పగించిన మోదీ
  • రాష్ట్రపతితో భేటీ.. మంత్రులతో చర్చలు
  • అదను చూసి దెబ్బ కొడతాం: సైన్యం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): కశ్మీర్‌లోని ఉరీ సైనిక శిబిరంపై ఉగ్రవాదుల దాడికి దీటైన సమాధానం చెప్పాలని కేంద్రం నిర్ణయించింది. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలను ఇక ఉపేక్షించకూడదని.. వాటికి గట్టి బుద్ధి చెప్పడమే కాక సమూలంగా ఏరివేసే చర్యలను చేపట్టాలని నిశ్చయించింది. ప్రధాని మోదీ నేతృత్వంలో సోమవారం జరిగిన భద్రతా వ్యవహారాల మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. పాక్‌ తీవ్రవాద సంస్థలకు బుద్ధి చెప్పేందుకు అనుసరించాల్సిన వ్యూహన్ని ఖరారు చేసే బాధ్యతను జాతీయ ర క్షణ సలహాదారు అజిత దోవల్‌కు ప్రధాని మోదీ అప్పగించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ‘‘పఠాన్‌కోట్‌ ఎయిర్‌బే్‌సపై దాడి చేసి ఏడుగురు జవాన్లను హతమార్చినా ఏమీ చేయలేకపోయాం. తాజాగా ఉరీలో ఉగ్రదాడి జరిగింది. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాల్సిందే. మీరేం చేస్తారో నాకు తెలియదు’’ అని మోదీ ఈ భేటీలో అన్నట్లు తెలిసింది. ఉరీ ఘటన అనంతరం దేశవ్యాప్తంగా వస్తున్న విమర్శలు, సలహాలు, సూచనలపై కూడా క్యాబినెట్‌ కమిటీ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. మోదీ నివాసంలో జరిగిన ఈ భేటీలో రక్షణ మంత్రి మనోహర్‌ పరీకర్‌, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఎన్‌ఎ్‌సఏ అజిత దోవల్‌, ఆర్మీ చీఫ్‌ దల్బీర్‌సింగ్‌లతో పాటు హోంశాఖ, రక్షణశాఖ సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. సుమారు రెండు గంటలకు పైగా జరిగిన సమావేశంలో ఉరీ ఉగ్రదాడికి ప్రతీకారం ఎలా తీర్చుకోవాలన్న అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. సీమాంతర ఉగ్రవాదం అణిచివేతకు సిద్ధం కావాలని, పాకిస్థాన్‌ అకృత్యాల గురించి అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లి ఆ దేశాన్ని ఎండగట్టే విధంగా చర్యలు తీసుకోవాలని.. ఉగ్రదాడుల్లో పాక్‌ హస్తానికి సంబంధించిన ఆధారాలను బయటపెట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
 
ఒక్కరోజులో పని పూర్తి చేస్తాం 
పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల ఏరివేతపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఒక్కరోజులో పని పూర్తి చేస్తామని సమావేశంలో పాల్గొన్న ఆర్మీ సీనియర్‌ అధికారులు ప్రధాని మోదీకి భరోసా ఇచ్చినట్లు తెలిసింది. వాస్తవాధీన రేఖ, పాక్‌ సరిహద్దులో ఉన్న ఉగ్రవాద క్యాంపుల సమాచారం తమ వద్ద ఉందని, కేంద్రం రాజకీయ నిర్ణయం తీసుకుంటే పక్కాగా పని పూర్తి చేస్తామని చెప్పినట్లు తెలిసింది. అయితే వ్యూహ, ప్రతివ్యూహాలను ఖరారు చేసే బాధ్యతలను అజిత దోవల్‌కు అప్పగించిన ప్రధాని, యుద్ధం తరహా వాతావరణాన్ని కల్పించకుండా కేవలం తీవ్రవాద స్థావరాలపైనే ఎలా దాడులు చేయాలన్నదానిపై దృష్టి సారించాల్సిందిగా స్పష్టంగా సూచించినట్లు సమాచారం. తీవ్రవాద స్థావరాల మీద దాడులపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని.. దళాలను సన్నద్ధంగా ఉండాల్సిందిగా మాత్రమే సూచించామని కేంద్ర హోంశాఖ అధికారులు తెలిపారు. కాగా.. ఈ సమావేశం అనంతరం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో మోదీ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
 
భద్రతపై సమీక్ష 
ప్రధాని మోదీతో భేటీకి ముందు రాజ్‌నాథ్‌సింగ్‌ నేతృత్వంలో నార్త్‌బ్లాక్‌లోని ఆయన కార్యాలయంలో ఉన్నతస్థాయి అధికారుల సమావేశం జరిగింది. ఆదివారం శ్రీనగర్‌ వెళ్లి క్షతగాత్రులను పరామర్శించిన రక్షణ మంత్రి పరీకర్‌ కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. పంజాబ్‌నుంచి గుజరాత వరకూ తీరప్రాంతంలో భద్రతతో పాటు జమ్మూకశ్మీర్‌ భద్రతపైనాఈ సమావేశంలో సమీక్షించారు. బలగాలన్నీ అప్రమత్తంగా ఉండాలని, ఉరీ తరహా దాడులు పునరావృతమయ్యే అవకాశం ఉన్నందున అందుకు సన్నద్ధంగా ఉండాలన్న నిఘావర్గాల నివేదికలపైనా ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. మరోవైపు.. ఉరీ ఘటనకు ప్రతిగా భావోద్వేగంతో కూడిన తక్షణ ప్రతిస్పందన ఉండబోదని ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి వర్గాలు స్పష్టం చేశాయి. అన్ని ప్రత్యామ్నాయాలనూ క్షుణ్నంగా పరిశీలించాకనే, అందరి అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకున్నాకనే.. పక్కా ప్రణాళిక, సమన్వయంతో ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకుంటుందని ఆ వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది మయన్మార్‌లో సర్జికల్‌ సై్ట్రక్స్‌ జరిపినప్పటికీ. ఈసారి ప్రత్యర్థి పాకిస్థాన్‌ కాబట్టి ఎలాంటి తొందరపాటు చర్యా తీసుకునే ప్రసక్తి లేదని తేల్చిచెప్పాయి. విదేశాంగ శాఖ సహాయమంత్రి వ్యాఖ్యలు కూడా ప్రభుత్వ ఆలోచన తీరుకు అద్దం పట్టే విధంగానే ఉన్నాయి. ఈ దాడి ఎలా జరిగిందో, లోపాలు ఎక్కడున్నాయో విశ్లేషించుకోవాలని, ఏదైనా చర్య తీసుకోబోయే ముందు కశ్మీర్‌ అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని ఆయన పేర్కొనడం గమనార్హం.

అదును చూసి దెబ్బ కొడతాం: సైన్యం 
ఉరీ ఘటన నేపథ్యంలో మన సైన్యం దీటుగా స్పందించాలని.. దెబ్బకుదెబ్బ తీయాలని దేశవ్యాప్తంగా పలువురు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో దీనిపై ఆర్మీ స్పందించింది. ఈ అంశంపై తాము అనుకున్నప్పుడు, తాము అనుకున్నచోట స్పందించే హక్కు తమకుందని మిలటరీ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ రణ్‌బీర్‌ సింగ్‌ తేల్చిచెప్పారు. గత 3-4 సంవత్సరాలతో పోలిస్తే చొరబాట్లు పెరిగాయని 2016లో ఇప్పటికే 17 చొరబాటు యత్నాలను భారత సైనికులు అడ్డుకున్నారని ఆయన వివరించారు. ఈ ఏడాది జమ్ముకశ్మీర్‌లో 110 మంది ఉగ్రవాదులు చనిపోగా.. వారిలో 31 మంది సరిహద్దులు దాటుతున్నసమయంలో భారత సైన్యం చేతిలో హతమైనవారేనని వెల్లడించారు. ‘‘నియంత్రణ రేఖ వెంబడి, సరిహద్దుల్లోని మారుమూల ప్రాంతాల్లో ఉగ్రవాదులపై చర్యలు చేపట్టినప్పుడు భారత సైన్యం గణనీయమైన నిగ్రహం పాటించింది. అయితే, అలాంటి తీవ్ర దాడులు, హింసాత్మక ఘటనల విషయంలో ఎలా వ్యవహరించాలో అలా దీటుగా సమాధానం చెప్పగల సత్తా మాకు ఉంది’’ అని స్పష్టం చేశారు. మరోవైపు.. ఉరీ దాడికి ప్రతి దాడి తప్పక ఉంటుందని, ఆ దాడి ఎలా? ఎప్పుడు? అనే విషయాలను వెల్లడించలేమని ఆర్మీలోని ఉన్నతాధికార వర్గాలు పేర్కొన్నాయి.


EmoticonEmoticon